విజయనగరం జిల్లా.
గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు.
గ్రామీణుల చెంతకే పరిపాలన వ్యవస్థను తీసుకువెళ్లి సుపరిపాలన అందించడం ద్వారా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్ముని ఆశయాలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా జిల్లాపరిషత్ కార్యాయలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, సి.ఇ.ఓ. రాజ్‌కుమార్, డి.పి.ఓ. నిర్మలాదేవి, పలువురు జిల్లాపరిషత్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ శాంతియుత ఉద్యమాల ద్వారా, అహింస ద్వారా ఎలాంటి కార్యాన్నయినా సాధించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. భారతీయులు ఎక్కడ వున్నా మహాత్మా గాంధీని స్మరించుకోవడం వారి కర్తవ్యమని పేర్కొన్నారు. మహాత్ముడు చూపిన మార్గాన్నే అనుసరిస్తూ ఆయన ఆశయాల సాధన దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. విద్యా కార్యక్రమాల సమన్వయ కర్త డోల మన్మథకుమార్, జెడ్పీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.