ఆశా వర్కర్లపై జగన్ సర్కార్ తీరు సిగ్గుచేటు..!
ఏలూరు జిల్లా, పోలవరం.
గర్భిణిల సంరక్షణలో మరో అమ్మ పాత్ర ఆశా వర్కర్లదని అలాంటి ఆశా వర్కర్లపై జగన్ సర్కార్ తీరు సిగ్గుచేటని సిఐటియు మండల సెక్రెటరీ పి ఎల్ ఎస్ కుమారి అన్నారు.చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనకుండా జిల్లాలో పలు చోట్ల ఆశా వర్కర్ల నిర్బంధం చేయడం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలవరం మండలం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఆశ వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కుమారి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిమాండ్లు సాధన కోసం వెళ్తున్న ఆశా వర్కర్లపై అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటూ ఈ ప్రభుత్వం మహిళలను ఇబ్బందులు పాలు చేయడం సరికాదని హితవు పలికారు.
పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచమని అడుగుతున్న ఆశ వర్కర్లపై నిర్ధాక్షణంగా హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించి దారుణంగా వ్యవహరించడం సరికాదని తీరు మార్చుకోకుంటే రానున్న ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని అన్నారు. ఆశా వర్కర్ల న్యాయమైన కోర్కెలు తీర్చాలని, అక్రమంగా నిర్బంధించిన వారిని విడుదల చేయాలని, అరెస్టు చేసిన వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.