ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా
ఆశా వర్కర్స్ కు వేతనాలు పెంచాలి, ఒప్పంద జి.వోలును అమలుచేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జాతీయ ఆరోగ్యమిషన్ (NHM)ఏర్పడి 20సంవత్సరాలైన సందర్బంగా *ఆశా వర్కర్లు సాధించిన విజయాలు -సవాళ్లు* అనే అంశం ఫై *సదస్సు* ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూటిఎఫ్ ఆఫీస్ లో జరిగింది. జిల్లా అధ్యక్షులు డి. ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన సదస్సు ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని,చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్ ని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ స్కీం ఏర్పడి 20 సం||లు అయినప్పటికీ ఆశాలకు కనీస వేతనాలు చెల్లించడంలేదని అన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరియు అనారోగ్యంతో చాలా మంది ఆశా వర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు 10 లక్షలు రూపాయల గ్రూప్ ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆశాలుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు.గత 7 సం||ల కాలంలో కేంద్రంలోని బిజేపి ఆశా వర్కర్లకి కేవలం రూ.1000/-లు మాత్రమే వేతనం పెంచిందని, గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు వేతనం పెంచలేదని అన్నారు. వైద్య ఆరోగ్య రంగానికి నిధులు కేటాయింపులు నానాటికి తగ్గుతున్నాయని, ప్రజారోగ్యానికి భద్రత కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశాల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేసారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద జిఓలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.రాజకీయ వేధింపులతో పలాస,సంతబొమ్మాళి లో ఆశాలపై తొలగింపులను జిల్లాలో అడ్డుకోవడం జరిగిందని అన్నారు.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయంగా కార్మికులు ఆనాడు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని, మేడే దినోత్సవాన్ని పోరాట స్ఫూర్తితో జరపాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 44 లేబర్ కోడ్లను రద్దుచేసి 4లేబర్ కోడ్ లుగా మార్పు తీసుకురావడం కార్మికుల మెడకు ఉరితాడులాంటిదని అన్నారు. కార్మికులు వేతనాలను బేరమాడే ఉమ్మడి శక్తిని, నిరసన తెలిపే హక్కులను కోల్పోతారని అన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ఈ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికుల్లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఇతర పద్ధతుల్లో విరివిగా ప్రచారం చేసి మే 20వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో కార్మిక వర్గం యావత్తు పాల్గొని జయప్రదం చేయడానికి నాయకత్వం కృషి చేయాలని అన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల వలన కార్మికులు బతుకులు నానాటికి దుర్భరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లపై వున్న ప్రేమ కార్మికులపై లేదని, కార్పొరేట్ మిత్రులకు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను ఆశా వర్కర్స్ అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవధ్యక్షులు కె. నాగమణి, ప్రధాన కార్యదర్శి జి.అమరావతి, నాయకులు పి.జయలక్ష్మి, లావణ్య, రాకోటి.సుజాత, పార్వతి,సుధ, స్వర్ణలతా పట్నాయక్, అన్నపూర్ణ, సంతోషి తదితరులు పాల్గొన్నారు.